సరోగసి అంటే ఏమిటీ..? సరోగిసి గురించి చట్టం ఏం చెప్తోంది..?

ఈమధ్య కాలంలో   సరోగసి ద్వారా తల్లి అవుతున్నవారు అధికం అవుతున్నారు.  హాలీవుడ్, బాలీవుడ్ కే పరిమితం అయిన సరోగసీ బేబీలు ఇప్పుడు టాలీవుడ్ కీ విస్తరించాయి. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లు అద్దె గర్భం ద్వారా తండ్రులయితే ఆ మధ్యన  టాలీవుడ్ కలెక్షన్ కింగ్ కూతురు మంచు లక్ష్మి సరోగసీ ద్వారా తల్లయ్యారు. ఈ నేపధ్యంలో ఇంతకీ ” సరోగసి ” అంటే ఏమిటి ? దాని లాభ-నష్టాలు ఏమిటి ? ఎప్పుడు సరోగసి అవసరం అవుతుందనే సందేహాలు కలుగుతున్నాయి. స్త్రీ జీవితానికి పరిపూర్ణతను చేకూర్చేది అమ్మతనం. కానీ, కొందరు స్త్రీలు కొన్ని ఆరోగ్యకారణాల వల్ల అమ్మతనానికి నోచుకోలేరు. అలా సంతాన అవకాశం లేని దంపతులు వేరే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకొని తద్వారా సంతానం పొందే విధానమే సరోగసి. సరగోసికి గర్భాన్ని దానం చేసే తల్లిని సరోగేట్‌ తల్లి అంటారు. పిల్లలు ఇక పుట్టరు అని అనుకొన్న దంపతులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనడం నిజంగా శాస్త్ర విజ్ఞానం ఇచ్చిన వరం. ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా వచ్చిన శిశువును సరోగసీ (అద్దె గర్భం) శిశువు అనవచ్చు. ఈ శిశువును కనే తల్లి సరోగసీ తల్లి అవుతుంది. 

మాతృత్వపు మమకారాన్ని నోచుకోని జంటలకు బిడ్డలను కని ఇచ్చేందుకు చాలామంది మహిళలు వారి పేదరికం వల్ల కాని,కుటుంబ సమస్యల వల్ల తమ గర్భాన్ని 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు అద్దెకు ఇవ్వడానికి సిద్దమవుతున్నారు,అంతే కాదు ఈ 9నెలల కాలం వరకు మంచి బలవర్ధకమైన తిండి కూడా దొరుకుతుందనే ఆశతో చాలా మంది పేద-మధ్యతరగతి స్త్రీలు ముందుకు వస్తున్నారు. సమస్యా మొదలైంది మొదట్లో ఇది గుజరాత్ పంజాబ్ లలో ప్రారంభమయినా, ఇప్పుడు భారతదేశమంతా పాకింది.  ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న హాస్పిటల్స్ తో పాటు అతి తక్కువ ధరకు అద్దె గర్భం అందుబాటులోకి రావడం కూడా   అద్దె అమ్మలకు భారతదేశం హబ్ గా మారిపోయింది. దీంతో ప్రపంచం నలుమూలల నుండి అద్దెగర్బానికి భారత దేశానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోయింది. చట్టం వచ్చింది  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘అద్దెగర్భం నియంత్రణ బిల్లు, 2016’ రూపొందించింది. దీని ప్రకారం, అవివాహిత దంపతులను, ఒంటరి తల్లిదండ్రులను, సహజీవన భాగస్వాములను, స్వలింగ సంపర్కులను అద్దెగర్భం ద్వారా పిల్లలను కనటానికి అనుమతించరు. అద్దెగర్భంతో కన్న పిల్లలను వదిలేయడం, లాభాపేక్షతో అద్దెగర్భ విధానాన్ని ఎంచుకోవటం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలుశిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌర కార్డులు గల భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులకూ అద్దెగర్భ నిషేధం వర్తిస్తుంది.   ప్రత్యేక  పరిస్థితుల్లోనే లాభాపేక్షలేని అద్దెగర్భం విధానాన్ని అనుమతిస్తున్నట్టు పొందుపరిచారు. సంతానం కావాలని కోరుకునే దంపతుల సన్నిహిత మహిళా బంధువునే, అదీ ఒకసారే అద్దెగర్భధారణకు అనుమతిస్తారు. ఆ మహిళకు వివాహమై ఉండాలి, ఆరోగ్యవంత సంతానాన్నీ కలిగుండాలి. అలాంటి వారిని మాత్రమే అద్దెగర్బానికి అనుమతి. అద్దెగర్భం ద్వారా పిల్లలను కనాలని అనుకునే దంపతులు తమలో ఒకరికి ఇక సంతానాన్ని పొందే అవకాశం లేదనే ధ్రువ పత్రాన్ని కూడా సమర్పించాలి. అద్దెగర్భం ద్వారా సంతానం కావాలని కోరుకునే మహిళనే పుట్టిన శిశువుకు తల్లిగా పరిగణిస్తారు.